టాలీవుడ్ దర్శక దీరుడు రాజమౌళి తాజా చిత్రం షూటింగ్ టాలీవుడ్ సినీ ప్రముఖుల సందడి మధ్య ప్రారంభమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరు కాగా, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాతో పాటు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్, వీవీ వినాయక్, కీరవాణి తదితరులు హాజరయ్యారు. ఇక కొద్ది రోజులుగా ఈ మూవీ పలు టైటిల్స్‌తో ప్రచారం అవుతుండగా,ఈ రోజు టైటిల్ రివీల్ చేయనున్నారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే పూజా కార్యక్రమంలో సినిమా క్లాప్ బోర్డ్ ఉంచగా, దానిపై ఆర్ఆర్ఆర్ అని మాత్రమే రాసి ఉంది. దీంతో అందరు ‘రామ రావణ రాజ్యం’ అనే పవర్ఫుల్ టైటిల్‌నే చిత్రానికి పెట్టి ఉంటారని భావిస్తున్నారు. కీరవాణి చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళేలా రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. చిత్రంలో ఓ కథానాయికగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుండగా, మరో హీరోయిన్ సమంత అని అంటున్నారు.