హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి నిరాకరించింది తెలంగాణ హైకోర్టు. కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. టీపీసీసీ నేతలు వేసిన పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. అయితే ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలా.. ఒద్దా.. అన్న నిర్ణయం వర్సిటీ వైస్ ఛాన్సెలర్‌కే వదిలేసింది. ఇందులో మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చేసింది.
ఓయూలో రాహుల్ పర్యటనకు వర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో టీపీసీసీ నేతలు నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. టీపీసీసీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి అందుకు నిరాకరించారు. అయినా కూడా తన న్యాయపోరాటాన్ని కొనసాగించిన టీపీసీసీ బుధవారం మరోమారు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు నిరాకరిస్తూ కీలక తీర్పు నిచ్చింది.