భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇటీవల 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత తన మనసులో వచ్చిన భావాలను తొలిసారి వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత క్రికెట్‌కే గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన కూడా వచ్చిందని రోహిత్ చెప్పాడు. రోహిత్ నాయకత్వంలో భారత్ 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను గెలుచుకుంది.
అయితే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ మాత్రం రోహిత్, టీమ్ ఇండియాను దాటిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టును ఫైనల్ వరకు నడిపించిన రోహిత్, అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఓడిపోవడంతో టైటిల్ అందుకోలేకపోయాడు.
ఈ విషయంపై ఒక కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్, ఆ ఓటమి తనను తీవ్రంగా కుంగదీసిందని చెప్పాడు.అందరం చాలా నిరాశకు గురయ్యాం. ఏం జరిగిందో నమ్మలేకపోయాం. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరల్డ్ కప్ కోసం అన్నీ అంకితం చేశాను. శరీరంలో శక్తి ఏమీ మిగలలేదు. మళ్లీ నా స్థితికి రావడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ బాధను మింగుకోవడం చాలా కష్టం. 2024 వరల్డ్ కప్‌పైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది అని రోహిత్ అన్నాడు.
ఒక దశలో ఇక ఈ ఆట ఆడకూడదని కూడా అనిపించింది. ఈ ఆట నన్ను పూర్తిగా ఖాళీ చేసింది. కానీ ఇది నాకు ఎంతో ఇష్టమైన ఆట అని, ఇంత సులభంగా వదిలేయకూడదని నన్ను నేనే గుర్తుచేసుకున్నాను. మళ్లీ మైదానంలోకి రావడానికి చాలా శ్రమ, మానసిక బలం అవసరమైంది అని ఆయన వివరించాడు. 38 ఏళ్ల రోహిత్ శర్మ 2026 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో మళ్లీ భారత్ తరఫున ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా, వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు.
Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

