టీమిండియా సారథి రోహిత్ శర్మ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ టీమిండియా టి20 కెప్టెన్‌గా స్వదేశంలో 15 విజయాలు అందుకున్నాడు. నిన్న రాత్రి శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ విజయం రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ విజయం. తద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్‌లను(చెరో 15 విజయాలు) రోహిత్ అధిగమించడం విశేషం.
ఇప్పటికే స్వదేశంలో టి20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లి(13), ఎంఎస్ ధోని(10)లను రోహిత్ ఎప్పుడో దాటేశాడు. ఓవరాల్‌గా టి20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం విశేషం. ఇక టీమిండియాకు పొట్టి ఫార్మాట్‌లో వరుసగా 11వ విజయం. టి20 ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలుపుతో మొదలైన విజయాల పరంపరను టీమిండియా దిగ్విజయంగా కొనసాగిస్తుంది. అంతేకాదు, నేటి సాయంత్రం శ్రీలంకతో జరగనున్న చివరి టీ20లో భారత జట్టు విజయం సాధిస్తే వరుసగా మూడు సిరీస్‌లలో ప్రత్యర్థి జట్లను వైట్‌వాష్ చేసిన జట్టుగానూ టీమిండియా రికార్డులకెక్కుతుంది.