USA:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

4
- Advertisement -

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఈ యువతులు అకాలంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామాల్లో శోకసంద్రం నెలకొంది.

మృతులు గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన మరియు ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావనగా గుర్తించారు. కాలిఫోర్నియాలో ప్రయాణిస్తున్న సమయంలో వీరు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఉన్నత విద్య లక్ష్యంగా ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికాకు వెళ్లిన తమ కుమార్తెలు ఇలా దుర్ఘటనకు గురికావడంతో కుటుంబ సభ్యులు తీరని దుఃఖంలో మునిగిపోయారు. ఈ వార్త తెలియగానే బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కుటుంబాలను పరామర్శిస్తూ సంతాపం తెలిపారు. యువతుల మృతి వార్తతో గార్ల, ముల్కనూర్ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్

- Advertisement -