Ponting:అభిషేక్..మ్యాచ్ విన్నరే!

3
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 టి20 బ్యాటర్‌గా ఉన్నప్పటికీ.. ఈ టోర్నమెంట్‌లో అంతగా రాణించడం లేదు. సూపర్ 8లో జింబాబ్వేపై అర్ధశతకం సాధించినా, వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు. స్పిన్నర్ అకీల్ హోసేన్ బౌలింగ్‌లో షిమ్రోన్ హెట్‌మైర్‌కు సులభ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లలో అభిషేక్ కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అతనికి విలువైన సూచనలు చేశాడు.

మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌కు ముందు మానసికంగా ఫ్రెష్‌గా ఉండాలని సూచించాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతిరోజూ నెట్స్‌లో గంటలకొద్దీ బ్యాటింగ్ చేయడం మంచిది కాదు. కొన్నిసార్లు మానసికంగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. నైపుణ్యాలు ఎక్కడికీ పోవు అని పాంటింగ్ అన్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న టోర్నమెంట్‌ల్లో బ్యాటింగ్‌కు కొద్దిసేపు విరామం ఇచ్చి, ఫీల్డింగ్, బౌలింగ్ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు.

Also Read:విజయ్ – రష్మికా రిసెప్షన్..కండీషన్స్ అప్లై!

అభిషేక్ ఇంగ్లండ్‌పై మంచి రికార్డు కలిగి ఉన్నాడని, అతనిని తప్పించకూడదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. గత జనవరిలో ఇదే వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌పై శతకం సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. సెమీఫైనల్‌లో అభిషేక్ ఏదో ప్రత్యేకంగా చేస్తాడని నమ్మకం ఉంది. అతను మ్యాచ్ విన్నర్ అని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు.

- Advertisement -