నిన్నటిదాక అర్జున్ రెడ్డి సినిమాను బేస్ చేసుకొని వీహెచ్, పవన్‌లపై సెటైర్లు విసిరిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వంగవీటి ఫ్యామిలీపై తన అక్కసును వెల్లగక్కాడు. వైసీపీ బహిష్కృత నేత గౌతమ్ రెడ్డి రంగా, రాధా హత్యలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. విజయవాడలో నిన్న రంగా కుమారుడు రాధా, రంగా భార్య రత్నకుమారిలను ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయన్న కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో రంగా భార్య రత్నకుమారి, కొడుకు రాధా కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాధా చొక్కా గుండీలు ఊడిపోయి ఉన్నాయి.
ఈ ఫోటోను ఫేస్ బుక్‌లో షేర్ చేసిన వర్మ వివాదాస్పద కామెంట్లు చేశాడు. తనకు వంగవీటి భార్య, కొడుకు అంటే ఎనలేని ప్రేమ అంటూ వర్మ వెటకారపు పోస్ట్ పెట్టాడు. అంతేకాదు, స్టేషన్లో ఇలా కూర్చున్నందుకు వంగవీటి రంగా తన భార్య, కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఫీలవుతాడని, స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తాడని పోస్ట్ చేసి అగ్నికి మరింత ఆజ్యం పోశాడు.
ఇంతటితో ఆగని వర్మ తల్లి ఎందుకు నల్లగా ఉందో, కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాలని పోస్ట్ చేసి వికృతానందాన్ని ప్రదర్శించాడు. దీనిపై నెటిజన్లు, రంగా అభిమానులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. వర్మ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆ కుటుంబం అతనికి సహకరించకపోవడమే ఈ వెకిలిచేష్టలకు కారణమని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.