సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ సమస్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, వర్మ తన సోషల్ మీడియా వేదికగా చేసిన సుదీర్ఘ పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది.
పైరసీ ఆగకపోవడానికి అసలు కారణం ప్రజల డిమాండ్‌నే అని వర్మ స్పష్టం చేశారు. టెక్నాలజీ, పోలీసుల నిఘా బలహీనత వల్ల కాదు, పైరసీ సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నంతవరకూ రవి లాంటి సరఫరాదారులు ఎప్పుడూ ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రవిని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్న కొందరిని టార్గెట్ చేస్తూ “రాబిన్ హుడ్ హీరో కాదు, అతను మొదట టెర్రరిస్ట్. ధనవంతుల నుంచి దోచుకోవడం గొప్ప లాజిక్ కాదు అని తేల్చి చెప్పారు.
పైరసీకి మద్దతు ఇచ్చేవారు చూపే లాజిక్‌ను వర్మ వ్యంగ్యంగా ఎండగట్టారు. “టికెట్ రేట్లు ఎక్కువా? -పైరసీ ఓకే”, “పాప్‌కార్న్ ఖరీదా? — సినిమాను లీక్ చేయండి అనే లాజిక్ ప్రకారం చూస్తే… BMW కారు ఖరీదైతే షోరూమ్‌ను దోచుకోవాలి లేదా బంగారం ఖరీదైతే షాపులను లూటీ చేయాలి అన్నట్టు అవుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో అరాచకానికి దారితీస్తాయని హెచ్చరించారు.
పైరసీని నిజంగా అరికట్టాలంటే, సరఫరా చేసేవారినే కాకుండా, పైరేటెడ్ కంటెంట్‌ను చూసే ప్రేక్షకులను కూడా నేరస్తులుగా పరిగణించాలి అని వర్మ సూచించారు. నేను కూడా పైరేటెడ్ కంటెంట్ చూస్తాను. ప్రేక్షకులు తమ సౌలభ్యం కోసం మాత్రమే పైరసీ చూస్తారు, నైతిక విప్లవం కోసం కాదు అని ఆయన పేర్కొన్నారు. పైరేటెడ్ కంటెంట్ చూస్తున్న 100 మందిని అరెస్ట్ చేసి, వారి పేర్లను పబ్లిక్‌గా ప్రకటించండి. భయం పనిచేస్తుంది… నైతికత కాదు అని ఆర్జీవీ సూటి వ్యాఖ్యలు చేశారు.
Also Read:Maharashtra:103 చోట్ల బీజేపీ ఏకగ్రీవం

