తన కొత్త సినిమా “వ్యూహం” రిలీజ్ ను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కావాల్సి ఉండగా..సెన్సార్ బృందం రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారు. వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులపై ప్రెస్ మీట్ లో మాట్లాడారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నిర్మాత దాసరి కిరణ్ కుమార్.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – ఇటీవల వ్యూహం సినిమాను సెన్సార్ కు ఇచ్చాం. సినిమా చూసిన సెన్సార్ వాళ్లు మా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు మెసేజ్ పంపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో మాత్రం వాళ్లు కారణాలు చెప్పలేదు. దీంతో ఈ నెల 10న రిలీజ్ కావాల్సిన వ్యూహం సినిమాను వాయిదా వేస్తున్నాం. గతంలో ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి సినిమాల విషయంలో రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే కోర్టు ద్వారా సినిమా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సెన్సార్ అనేది సినిమా రిలీజ్ ను ఆపకూడదని కోర్టులు కూడా చెప్పాయి. మేము కూడా అదే దారిని అనుసరిస్తాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం సినిమాను రిలీజ్ చేసుకుంటాం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే మా వ్యూహం సినిమా రిలీజ్ ను కూడా ఎవరూ ఆపలేరు. ఈలోగా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. వ్యూహం సినిమా ఆపాలని నారా లోకేష్ సెన్సార్ కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంతో నిజమో చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలు చెప్పినట్లే..నేను వ్యూహం సినిమా ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. ఆర్టికల్ 19 ప్రకారం పౌరుడిగా నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు ఉంది. నేను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యం సినిమాలు రూపొందించాను, అలాగే బాలీవుడ్ లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సినిమాలు చేశారు. అవన్నీ అపగలిగారా..వ్యక్తుల గురించైనా, ఏదైనా ఇష్యూ గురించైనా ఎవరి అభిప్రాయాలైనా చెప్పవచ్చు. సెన్సార్ అనేది మత సామరస్యం దెబ్బతినకుండా, కులాలను కించపరిచే సినిమాలు బయటకు రాకుండా లా అండ్ ఆర్డర్ కోణంలో అడ్డుకుంటుంది. అంతే గానీ వ్యక్తులపై అభిప్రాయాలు చెప్పే సినిమాలను ఆపే పవర్ సెన్సార్ కు లేదు. రివైజింగ్ కమిటీకి ఎప్పుడు పంపిస్తారో డేట్ చెప్పలేదు. వాళ్లు చూసి ఏం చెప్తారో విని..తదుపరి స్టెప్స్ తీసుకుంటాం అన్నారు.
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – సెన్సార్ వాళ్లు మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినంత మాత్రాన మా సినిమాకు ఎలాంటి నష్టం జరగదు. అన్నీ సకాలంలో మేము అనుకున్నట్లే జరుగుతాయని ఆశిస్తున్నాం. రివైజింగ్ కమిటీ చూసి వాళ్ల అభిప్రాయం చెప్పేదాక ఏదీ ఎవరి చేతుల్లో ఉండదు. వ్యూహం సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే వెల్లడిస్తాం. అన్నారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ వ్యూహం సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా..వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నారు.
Also Read:నట్టి కుమార్ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్