విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడిగా తెరంగ్రేటం చేసిన మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన సినిమా గుంటూరోడు. పదేళ్ల సినిమా ప్రస్తానంలో వెండితెరపై మాస్ అవతారంలో కనిపించినా పక్కా మాస్ కథతో మాత్రం సినిమా చేయలేదు. డిఫరెంట్ కథలు,క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించిన మనోజ్ గుంటూరోడుతో ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాతో నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి గుంటూరోడుతో మనోజ్ ప్రేక్షకులను అలరించాడో లేదో చూద్దాం.
కథ :
గుంటూరు కుర్రాడు కన్నా(మంచు మనోజ్) ఊర్లో అందరితోనూ గొడవలు పడుతుంటాడు. తన కొడుకంటే సూర్యనారాయణ (రాజేంద్రప్రసాద్)కు ప్రాణం. కన్నాను దారిలోకి తెచ్చేందుకు పెళ్లి చేయాలనకుంటాడు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పక్కన ఉన్న అమ్మాయి అమృత(ప్రగ్యాజైశ్వాల్)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఎమ్మెల్యే కావాలనుకున్న క్రిమినల్ లాయర్ శేషు(సంపత్‌రాజ్) చెల్లెలు అమృత. అహంకారి అయిన శేషుతో అనుకోకుండా కన్నాకి శత్రుత్వం ఏర్పడుతుంది. ఆ శత్రుత్వం ఎందుకు?.. తనకు శత్రువైన కన్నాకి శేషు చెల్లిల్ని ఇచ్చి పెళ్లి చేశాడా?.. శేషు ఎమ్మెల్యే అయ్యాడా?.. తదితర విషయాలను తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మంచు మనోజ్, నటీనటులు, ఫస్టాఫ్‌కు ముందు వచ్చే సన్నివేశాలు, ఫైట్స్ . మంచు మనోజ్ తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. డ్యాన్సులు, ఫైట్స్ విషయంలోనే కాదు, క్యారెక్టర్‌ను క్యారీ చేసిన తీరు ఆకట్టుకుంది. మంచి బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను అలరించాడు మనోజ్. మనోజ్ యాక్టింగ్ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. హీరోయిన్ పగ్ర్యా జైశ్వాల్, తన పాత్రకు న్యాయం చేసింది. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ ఒదిగిపోగా విలన్‌గా నటించిన సంపత్ అద్భుతంగా నటించాడు. మనోజ్, సంపత్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా ఉన్నాయి. వీరి మధ్య పోరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక కోట శ్రీనివాసరావు, రావు రమేష్, కాశీవిశ్వనాథ్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సత్య, ప్రవీణ్, పృథ్వీ కామెడి కూడా పరావాలేదనిపిస్తుందే తప్ప గొప్పగా అనిపించదు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సాదా సీదా కథ, కామెడీ లేకపోవడం. బ్రాక్ గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ సన్నివేశాలు. కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన అంశాలేవీ లేకపోవడంతో సినిమా చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. తండ్రి-కొడుకు, అన్నా-చెల్లెలు వంటి బంధాలు.. ఆ నేపథ్యంలో సన్నివేశాలున్నా భావోద్వేగాలు మాత్రం పండవు. కామెడీ కూడా అంతంత మాత్రమే.ఇలాంటి కథల్లో భావోద్వేగాలతో పాటు కామెడీ, ఉత్కంఠను రేకెత్తించే అంశాల్ని చూపించేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దర్శకుడు ఆ విషయాలపై దృష్టి పెట్టలేదు
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. దర్శకుడు ఎస్.కె.సత్య మనోజ్‌ను మాస్ హీరోగా చూపించే ప్రయత్నం బాగానే ఉంది. అవుటండ్ అవుట్ కమర్షియల్ సినిమాలో మనోజ్‌ను ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పక్కా యూత్ మాట్లాడుకునే భాషలో, మాస్‌కు కనెక్ట్ అయ్యేలా సత్య సంభాషణలు రాసుకున్నాడు. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ బావుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ డిజె.వసంత్ అందించిన ట్యూన్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన సినిమా మచు మనోజ్ గుంటూరోడు. మంచు మనోజ్, ఫస్టాఫ్‌కు ముందు వచ్చే సన్నివేశాలు, ఫైట్స్ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా కథా కథనాల్లో కొత్తదనం లేక పోవడం,కామెడీ, చప్పగా సాగే సన్నివేశాలు మైనస్ పాయింట్స్. మొత్తంగా తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో మంచు మనోజ్ చేసిన ఔట్ అండ్ ఔట్ కమర్షియల్
ఎంటర్ టైనర్ గుంటూరోడు.
విడుదల తేదీ: .3/03/2017
రేటింగ్ : 3/5
నటీనటులు: మంచు మనోజ్,ప్రగ్యాజైశ్వాల్
సంగీతం: డి.జె. వసంత్
నిర్మాణ సంస్థ: క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: ఎస్.కె. సత్య