పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. చిన్న సినిమాగా విడుదలైన పెళ్లిచూపులు రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేసింది. తాజాగా ఈ నగరానికి ఏమైంది…?అంటూ ప్రేక్షకుల ముందు మరోసారి మ్యాజిక్ చేయడానికి వచ్చాడు తరుణ్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది..?తరుణ్ భాస్కర్ మరోసారి మ్యాజిక్ చేశాడా లేదా చూద్దాం…
కథ:
నలుగురు స్నేహితుల మధ్య సాగే కథే ఈ నగరానికి ఏమైంది. వివేక్, కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర షార్ట్ ఫిల్మ్ తీసి తమ ప్రతిభను ప్రపంచానికి చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ గ్యాంగ్‌లో తరచూ గొడవలు వస్తుంటాయి. కార్తీక్ జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.తన స్నేహితులు ముగ్గురినీ పార్టీకి పిలుస్తారు..సీన్ కట్ చేస్తే గోవాలో ప్రత్యక్షమవుతారు..?అసలు గోవా ఎందుకు వెళ్లారు..?అక్కడ ఏం జరుగుతుంది..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ యూత్‌కి నచ్చే సన్నివేశాలు,మాటలు. తొలిసినిమానే అయినా నలుగురు అద్భుతంగా నటించారు. కొత్త వారి నుంచి తనకు కావాల్సిన ఎమోషన్‌ను రాబట్టుకున్నాడు దర్శకుడు. కౌశిక్ నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్స్ అందంగా కనిపించారు. కథ పెద్దగా లేకపోయినా నలుగురు స్నేహితుల జర్నీని యూత్‌కి నచ్చేలా అందంగా,సహజంగా తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ,మందు తాగే సన్నివేశాలు ఎక్కువగా ఉండటం,సెకండాఫ్. షార్ట్ ఫిల్మ్ కోసం చేసే ప్రయత్నాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ప్రేమజంట విడిపోవడానికి కారణం,వివేక్ కొన్నాళ్ల పాటు స్నేహితులకు దూరంగా ఉండటం అతకలేదు. బలమైన కథ లేకపోవడంతో సన్నివేశాలు పట్టు తప్పినట్లు అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. యూత్‌కు నచ్చేలా నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగుంది. రచయితగా తరుణ్ భాస్కర్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
తొలిసినిమా పెళ్ళిచూపులుతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. నలుగురు స్నేహితుల ప్రయాణం ఆధారంగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. మాటలు,యూత్‌కి నచ్చే సన్నివేశాలు సినిమాకు ప్లస్ కాగా కథ మైనస్ పాయింట్. ఓవరాల్‌గా యూత్ టార్గెట్‌గా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన మరో ప్రయత్నమే ఈ నగరానికి ఏమైంది.
విడుదల తేదీ:29/06/2018
రేటింగ్: 2.75/5
నటీనటులు: విశ్వక్సేన్ నాయుడు, సుశాంత్‌రెడ్డి, అనిషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: డి.సురేష్‌బాబు
దర్శకత్వం: తరుణ్ భాస్కర్

