అంతా అనుకున్నట్లే జరిగింది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రేవంత్….టీడీపీలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనని బాధించాయన్నారు. అమరావతిలో చంద్రబాబుతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. తెలంగాణలో పరిస్థితులను, పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
టీడీపీలో తనకు లభించిన ప్రాదాన్యతను ఎప్పటికి మర్చిపోనని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.టీడీపీ, చంద్రబాబు అంటే ఎప్పుడూ గౌరవమేనని తెలిపారు.నిన్న హైదరాబాద్‌లో టీటీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. రేవంత్ వ్యవహారంపై చర్చించారు. అయితే రేవంత్ వ్యవహారాన్ని చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. ఇక ఇవాళ అమరావతిలో రేవంత్‌తో పాటు టీటీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ కాగా తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శికి లేఖను అందజేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌తో భేటీ కావడంతో ఆయన ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలను ఖండించని రేవంత్… ఏపీ టీడీపీ నేతలను ప్రత్యక్షంగా విమర్శించారు. టీటీడీపీ నేతలు సైతం రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.