రాష్ట్రంలో మానవత్వంలేని పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. జీవో 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు బలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని అన్నారు. ఈరోజు ఆయన మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి 317 జీవోకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. బదిలీ కావడంతో మనస్తాపంతో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జైత్రం నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మరణించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన పోలేదు.. కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. ఆ రోజే నేను వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులతో నిర్బంధించారు. ఫోన్‌లో పరామర్శించాల్సి వచ్చింది. 317 జీవో అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ – బీజేపీలో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించే స్థానంలో ఉన్న బీజేపీ మరింత జఠిలం చేసే లబ్ధి పొందాలనుకుంటోంది. ఉపాధ్యాయ – ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. వారికి అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జైత్రం నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి ఫోన్‌లో కలెక్టర్‌తో మాట్లాడారు.