ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూకి హామీ ఇచ్చారు. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ బృందానికి వివరించారు.
ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. నవ తరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు.
ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజన్ అద్భుతంగా ఉందంటూ యాంగ్ లియూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్ ను సందర్శిస్తానని తెలిపారు.
Also Read:‘హరి హర వీర మల్లు’..షూటింగ్‌లో పవన్