- Advertisement -
స్వరాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా జీవితాంతం లడాయి చేసిన పోరాటయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఉద్యమాల ఉపాధ్యాయుడు.. తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన పోరాటయోధుడు…పుట్టుక ఆయనదే.. చావు ఆయనదే. కానీ… జయశంకర్ సార్ బతుకంతా తెలంగాణది. ఇవాళ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ఘనంగా నివాళి అర్పిస్తోంది.
1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటల మహాలక్ష్మి, లక్ష్మీకాంతరావు దంపతులకు జన్మించారు …. జయశంకర్. చిన్నప్పటి నుంచి అన్యాయంపై గొంతెత్తిన ఆయన.. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకున్నారు. నాన్ ముల్కీ ఉద్యమం మొదలుకొని.. మలిదశ పోరాటం వరకు ప్రతి మలుపులోనూ ఆయన పాత్ర అనిర్వచనీయం.
సార్ జీవితం ఆద్యంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే సాగింది. జయశంకర్ సార్ తుదిశ్వాస విడిచే వరకు తెలంగాణ కోసం పాటుపడ్డారు. ప్రాథమిక విద్యను అక్కంపేటలోనే పూర్తి చేసిన జయశంకర్ సార్… తన ఊరి చిన్ననాటి జ్ఞాపకాలను సందర్భోచితంగా తన స్నేహితుల వద్ద పదే పదే గుర్తు చేసుకునేవారు. చిన్ననాటి స్నేహితులతో ఎల్లప్పుడూ సంబంధాలు నెరుపుతూనే ఊరి బాగోగులపై వాకబు చేసేవారు. ఇలా.. సార్ ఏ స్థాయికి వెళ్లినా.. సమయం చిక్కినప్పుడల్లా తన సొంతూరికి వచ్చి తన వారిని కలిసి వెళ్లేవారు. అంతటి మహాన్నత వ్యక్తిని తెలంగాణ సమాజానికి అందించిన అక్కంపేట గ్రామం నిజంగా చరిత్ర పుటల్లో కొన్ని పేజీలను దక్కించుకుంది.
తెలంగాణ సిద్ధాంతకర్తగా అందరికీ దశ, దిశ చూపించిన దార్శనికుడాయన. తెలంగాణ కోసమే అనుక్షణం పరితపించి… స్వరాష్ట్రాన్ని చూడకుండానే వెళ్లిపోయిన పెద్దసారుకు మరణం లేదు. ఇవాళ ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా గ్రేట్ తెలంగాణ.కామ్ ఘననివాళి అర్పిస్తోంది.
Also Read:కూర్మాసనంతో ఉపయోగాలు!
- Advertisement -