రిలయన్స్ జియో ప్రవేశంతో భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దానికి కారణం రిలయన్స్ జియోనే… ఉచిత ఆఫర్లతో ఇతర టెలికం కంపెనీలకు చుక్కలు చూపించింది. జియో దెబ్బకి ఎయిర్టెల్, ఐడియా, వొడాఫొన్,లాంటి బడా కంపెనీలు సైతం లబోదిబోమన్నాయి.
ఒక రకంగా చెప్పాలంటే..జియో సంచలన ఆఫర్లు ప్రకటించడంతో అన్ని టెలికం కంపెనీల షేర్లు కుప్పకూలిపోయాయి. అయితే టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించి, ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అనే ప్రకటనతో కోట్ల మంది ప్రజలను తన వైపు తిప్పుకుంది జియో.
ఇదిలాఉంటే..రిలయన్స్ జియో యూజర్లకు మరో గుడ్ న్యూస్..రిలయన్స్ జియో ఫ్రీ స్కీమ్స్, డిస్కౌంట్ ఆఫర్లు మరో 12 నుంచి 18 నెలల వరకూ ప్రకటిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాతే వినియోగదారుల నుంచి పూర్తి స్థాయిలో చార్జీలు వసూలు చేయాలని జియో నిర్ణయించినట్లు సమాచారం.
జియో ఈ నిర్ణయం తీసుకోవాలని భావించడానికి కారణం ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలేనట. ఈ కంపెనీలు జియో దెబ్బకు అన్లిమిటెడ్ బాట పట్టాయి. భారమని తెలిసి కూడా వేరే దారిలేక ఈ నిర్ణయం తీసుకున్నాయి.
అయితే ఈ అన్లిమిటెడ్ ఆఫర్లను నిరంతరం కొనసాగించడం కాని పని. ఈ విషయాన్నే జియో గుర్తించింది. దీంతో ఇప్పటికిప్పుడు వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన జియో ఈ డిస్కౌంట్స్‌ను, అన్లిమిటెడ్ లాభాలను మరో సంవత్సరం నుంచి సంవత్సరంనర వరకూ ప్రకటిస్తూనే ఉండాలని చూస్తోంది.
మరో సంవత్సరం పాటు అన్లిమిటెడ్ ప్లాన్స్‌ను భరించడం ప్రత్యర్థి కంపెనీలకు సాధ్యంకాని పనిగా జియో యోచిస్తోంది. పైగా అన్లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించడంతో ఇతర కంపెనీలు నెలకు ఒక్కో ప్రీపెయిడ్ వినియోగదారుడి నుంచి 3వందల రూపాయలు మాత్రమే ఆదాయాన్ని పొందుతున్నట్లు యూఎస్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్నీ నివేదికలో వివరించింది.
జియో ఆఫర్ల వల్ల ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు వసూలు చేస్తున్న సగటు ఆదాయం భారీగా పడిపోయిందని, ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే ఇతర టెలికాం కంపెనీల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని మోర్గాన్ స్నాన్లీ వివరించింది. ఇక ఇదిలా ఉంటే..ఇప్పటికే ఎయిర్టెల్, ఐడియా, వొడాఫొన్,లాంటి బడా కంపెనీలు అవకాశం దొరికినప్పుడల్లా జియోపై విరుచుకుపడుతుండడం తెలిసిందే.