దేశంలో 5జీ సేవలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. అయితే తొలుత అన్ని పట్టణాల్లో కాకూండ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
4జీ సేవలతో పోలిస్తే 5జీలో వేగం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముందుగా 5జీ సేవలు హైదరాబాద్ తో పాటు, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్ కతా, లక్నో, ముంబై, పూణెలో మొదలు కానున్నాయి.
అక్టోబర్ నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. 5జీ వేలంలో అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచిన రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఫైబర్ లభ్యత, బలమైన ప్రపంచ భాగస్వామ్యంతో సాధ్యమైనంత తక్కువ సమయంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అందుబాటులో ధరలో ప్రపంచ స్థాయి 5జీ సర్వీసులను అందిస్తామని పేర్కొంది.
రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. 5జీ సేవలు, 5జీ ప్లాట్‌ఫామ్స్, 5జీ ఆవిష్కరణలు అందిస్తానని చెప్పారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మ్యానుఫ్యాక్చరింగ్, ఇ-ఆపరేషన్స్ వంటి క్లిష్టమైన రంగాలలో 5జీ సేవలను అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
5జీ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.88,078 కోట్లు వెచ్చించింది.