హ్యాపీ బర్త్ డే…సాహో

685
- Advertisement -

తెలుగు తెర వైభవాన్ని పెంచిన రాజసం… ప్రపంచ సినీ ప్రేక్షకుల అభిమానం తన కైవశం.రాష్ట్రాల సరిహద్దులు దాటింది.. దేశ దేశాలకూ పాకింది .చిన్నా, పెద్దా తేడా లేదంది.. భాషాభేదం లేనే లేదంది.అందరి నోటా ఒకే మాట.. పత్రి పెదవిపై అదే పాట.భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి.! అటు అమరేంద్ర బాహుబలి అనే యోధుడిగా,ఇటు మహేంద్ర బాహుబలి అనే వీరుడిగా, రెండు పాత్రలతోనూ… రెండు పార్టులతోనూ,అశేష ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని,హీరోగా తన ఛరిష్మానీ.. స్టార్‌గా తన ఇమేజ్‌నీ,అన్‌ బిలీవబుల్‌ హైట్స్‌కి చేర్చుకున్నారు.

అభిమానుల ‘డార్లింగ్‌’.. అందరూ మెచ్చే ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’,యంగ్‌ రెబల్‌స్టార్‌ పభ్రాస్‌,’బాహుబలి’ సిరీస్‌తో ఆల్‌ ఓవర్‌ ది వరల్డ్‌ అభిమానుల్ని, తన తదుపరి చిత్రం కోసం వేచి చూసే ఆల్‌ లాంగ్వేజెస్‌ ఆడియెన్స్‌నీ సంపాదించుకున్న యంగ్‌ రెబల్‌స్టార్‌ తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌ కూడా నెక్స్‌ట్‌ లెవెల్‌లోనే ఉండేలా కేర్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో
బిజీ బిజీగా వున్న ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ బర్త్‌డే అక్టోబర్‌ 23 సందర్భంగా తన సినీ జీవిత పయనంపై ప్రత్యేక కథనం..!

తిరుగులేని క్రేజ్‌..!

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు నటవారసుడుగా పరిచయమైన ప్రభాస్‌ ‘హీరో అంటే ఇలా ఉండ్రాలా’ అనేలా అందరినీ ఆకట్టుకునే ఆరడుగుల అజానబాహుడు. ‘ఈశ్వర్‌’ చిత్రంతో హీరోగా పరిచయమై అనతికాలంలోనే తన నటనతో అందరి మన్ననలు పొందారు. ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి’ వంటి విభిన్నమైన చిత్రాలు చేసి అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌. అయితే 2015లో ‘బాహుబలి ది బిగినింగ్‌’, 2017లో విడుదలైన ‘బాహుబలి 2’తో తిరుగులేని క్రేజ్‌ను తన సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్‌. అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంగా వేస్తున్న ప్రతి అడుగులో తను చూపే కృషి, పట్టుదల, దీక్ష.. ప్రభాస్‌ని కోట్లాది మందికి చేరువ చేశాయి.

prabhas

బాక్సాఫీస్‌ బాహుబలి..!

ప్రజల అభిమానం సంపాదించుకున్న నాయకుడు రాజ్యాధికారాన్ని వదులుకోవడం.. రాజ్యం కోసం బల్లాలదేవ వంటి బలమైన ప్రతి నాయకుడితో రాజ్యం కోసం పోరాడటం అనే విషయాలను విజువల్‌గా తెరపై ఆవిష్కరించడం సులువైన విషయం కాదనే సంగతి రాజమౌళికి తెలుసు. ఆయితే రాజమౌళి కలను సాకారం చేసే హీరోగా ప్రభాస్‌ ఆయనకు కనపడ్డారు. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన బాహుబలిని ఐదేళ్ల వరకు ఓ మహాయజ్ఞంలా పూర్తి చేయడానికి ప్రభాస్‌ పడ్డ కష్టమేంటో సినిమా రిలీజైన తర్వాతే అందరికీ తెలిసింది. ఐదేళ్ల వరకు మరో ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించ కుండా ఓ కమిట్‌మెంట్‌తో సినిమా చెయ్యాలంటే ఏ హీరో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ప్రభాస్‌ మాత్రం అలా ఆలోచించలేదు. ఐదేళ్లు బాహుబలి గురించే తపన పడ్డారు. మరో సినిమా చేయడానికి కూడా ఇష్టపడలేదు. ప్రభాస్‌ తపన, రాజమౌళి కృషి కలయికే ‘బాహుబలి’.

రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేయడమే కాదు, ఏకంగా తెలుగు సినిమా మార్కెట్‌ను ఆకాశమే హద్దు అనేలా చేసింది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమంటూ ప్రభాస్‌ అభిమానులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో కలెక్షన్స్‌ రూపంలో బదులిచ్చారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డుల రూపంలో ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందంటే ఆ సినిమా ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలి కలెక్షన్స్‌ కుంభవృష్టిని కురిపించింది. తెలుగు సినిమాకు ఇంత పెద్ద మార్కెట్‌ ఉందా? అసలు ఎవరీ ప్రభాస్‌ అని యావత్‌ ప్రపంచ సినీ పరిశ్రమ తల తిప్పి చూసేలా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

రాజమౌళి టేకింగ్‌, ప్రభాస్‌ యాక్టింగ్‌ కలవడంతో సంచలనాలకు కొదవలేకుండా పోయింది. పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్‌ హీరో అయ్యారు ప్రభాస్‌. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్‌లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు వుండేది. కానీ, ఇప్పుడు ప్రభాస్‌ నటనకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్‌ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్‌ ప్రకటించడం అతనికి వున్న ఫాలో యింగ్‌ని తెలియజేస్తుంది. బాహుబలితో ఇతర భాషల్లో కూడా ప్రభాస్‌కు ఆదరణ పెరగడంతో గతంలో ప్రభాస్‌ నటించిన సినిమాలు సోషల్‌ మీడియాలో, డబ్బింగ్‌ వెర్షన్స్‌లో సూపర్‌హిట్‌ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్‌ చూసిన చిత్రాలుగా నిలిచాయి.

అంతర్జాతీయ గుర్తింపు.. అరుదైన గౌరవం..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్‌ నిలిచారు. ఇప్పుడు ప్రభాస్‌ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేకమంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు ప్రభాస్‌. భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. దీంతో ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

భారీ అంచనాలతో ‘సాహో’గా ..!
బాహుబలితో యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌తో యువి క్రియేషన్స్‌ సంస్థ ‘రన్‌ రాజా రన్‌’ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ చిత్రాన్ని హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ప్రభాస్‌ లుక్స్‌ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను నెలకొనేలా చేశాయి. ప్రభాస్‌ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా మేకింగ్‌ కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గడం లేదు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మందిరా బేడి, ఎవ్‌లిన్‌ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ వంటి బాలీవుడ్‌ తారలు నటిస్తుం డటం విశేషం. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌మాస్ట ర్స్‌తో పాటు బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ పనిచేస్తున్నారు. ఈ సినిమా మేకింగ్‌ వీడియోను ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం కోసం ఇటు అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరో భారీ చిత్రానికి శ్రీకారం..!

‘సాహో’ సెట్స్‌లో ఉండగానే ప్రభాస్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే మరో భారీ బడ్జెట్‌ చిత్రం షూటింగ్‌లో పాల్గొని ఆశ్చర్యానికి గురి చేశారు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శక త్వంలో ఇటలీలో షూటింగ్‌ ప్రారంభమైంది. యూరప్‌లో అత్యధిక భాగం షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. ఈ చిత్రానికి కూడా
హాలీవుడ్‌ టెక్నీషి యన్స్‌ పనిచేస్తున్నారు. ప్రభాస్‌ చేసే సినిమాలన్నీ దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు బాలీవుడ్‌లో కూడా నిర్మాణం జరుపుకుంటున్నాయి. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌లో కూడా ప్రభాస్‌ ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా ‘డార్లింగ్‌’ అంటూ పలకరించే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

- Advertisement -