గేల్ జిగేల్..బెంగుళూరు గ్రాండ్ విక్టరీ

141
RCB spinners seal win after batting blitz

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాడిన పడింది. గేల్, కోహ్లీ మెరుపులతో గ్రాండ్ విక్టరీ సాధించింది. బెంగళూరు విధించిన 214 పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మిత్‌ (1) త్వరగానే నిష్క్రమించినా మెక్‌కలమ్‌ జోరుగా బ్యాటింగ్‌ చేయడంతో ఛేదనలో లయన్స్‌ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రైనా (23; 8 బంతుల్లో 2×4, 2×6) ఉన్నకాసేపు విరుచుకుపడ్డాడు. చాహల్‌ వేసిన నాలుగో ఓవర్లో అతడు వెనుదిరిగాడు.బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (72; 44 బంతుల్లో 2×4, 7×6), ఇషాన్‌ కిషన్‌ (39; 16 బంతుల్లో 2×4, 4×6) మెరిసినా.. ఛేదనలో గుజరాత్‌ 7 వికెట్లకు వికెట్లకు 192 పరుగులే చేయగలిగింది. హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత బెంగళూరుకు ఇది తొలి విజయం.

అంతకముందు టాస్ గెలిచిన గుజరాత్‌…ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్టులో అందరు స్టార్లు ఉన్న వరుస పరాజయాలు మరోవైపు స్టార్ బ్యాట్స్ మెన్ గేల్ ఫామ్‌లో లేకపోవడం ఆర్సీబీకి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్ మెన్ సత్తాచాటారు. ముఖ్యంగా ఫామ్‌లోకి వచ్చిన గేల్ జూలు విదిల్చాడు.

క్రిస్‌ గేల్‌ (77; 38 బంతుల్లో 5×4, 7×6) వీరబాదుడు బాదడంతో మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ 21 పరుగుల తేడాతో రైనా నేతృత్వంలోని గుజరాత్‌ లయన్స్‌ను ఓడించింది. గేల్‌తో పాటు కెప్టెన్‌ కోహ్లి (64; 50 బంతుల్లో 7×4, 1×6), ట్రావిస్‌ హెడ్‌ (30 నాటౌట్‌; 16 బంతుల్లో 2×4, 1×6), జాదవ్‌ (38 నాటౌట్‌; 16 బంతుల్లో 5×4, 2×6) లయన్స్‌ను ఉతికేయడంతో మొదట బెంగళూరు 2 వికెట్లకు 213 పరుగులు సాధించింది.