పెద్ద నోట్ల రద్దుపై ఎట్టకేలకు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నోరు విప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితితులను రోజువారీగా పరిశీలిస్తున్నామని… బ్యాంకుల్లో నగదు లభ్యత రోజురోజుకు పెరుగుతోందని…నగదు సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకులు పనిచేస్తున్నాయని ఉర్జిత్ పటేల్ తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉందని,.. డిమాండ్‌కు అనుగుణంగా నోట్ల ముద్రణ కూడా జరుగుతోందని పెర్కొన్నారు. డెబిట్ కార్డులు ఉపయోగించడం వల్ల చవకగా, తేలిగ్గా లావాదేవీలు జరుపుకోవచ్చని ఆయన అన్నారు.
కొత్త నోట్లు అందుబాటులో ఉంచేలా ప్రింటింగ్ ప్రెస్‌లు పూర్తి స్థామర్థ్యంతో పనిచేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. కొత్త నోట్ల సైజు, మందం విషయంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంపై ఆయన స్పందిస్తూ, నకిలీ నోట్ల అక్రమతయారీకి వీలు లేని విధంగా కొత్త కరెన్సీని డిజైన్ చేశామని ఉర్జిత్ పటేల్ సమాధానమిచ్చారు.
రూ.500,1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన తర్వాత ఉర్జిత్ పటేల్ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. చిల్లర సమస్యతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా… బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరినా… రూ.2వేల నోటుకు చిల్లర దొరక్క సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నా.. ఉర్జిత్ పటేల్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆయన స్పందించడం ఇదే మొదటిసారి.