అయోధ్య…సయోధ్య కుదిరేనా…?

215
Ravi Shankar meets Adityanath over Ayodhya issue
- Advertisement -

అయోధ్యలో రామమందిర దుమారం  మరోసారి తెరపైకి వచ్చింది. వివాదాస్సద స్థలంలో రామమందిర నిర్మాణం అంశంపై కోర్టు బయట మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్న సుప్రీం సూచనతో ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ మరోసారి ముందుకొచ్చారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన అయోధ్య వివాదంపై చర్చించారు.

ఈ సమావేశం అనంతరం రామజన్మభూమి అంశం 2019కల్లా పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని రవిశంకర్ వ్యక్తంచేశారు.  రవిశంకర్ తీసుకుంటున్న చొరవను  ఆదిత్యనాథ్‌తో పాటు షియా వక్ఫ్ బోర్డు ప్రశంసిస్తుండగా పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కేసుపై  డిసెంబర్ 6న న్యాయస్ధానం తుదివాదనలు విననుంది.

ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని న్యాయ ప్రక్రియ పూర్తయ్యాకే చర్చలు జరపొచ్చని కొంతమంది బీజేపీ నేతలు చెబుతున్నారు. విశ్వహిందూపరిషత్‌ (వీహెచ్‌పీ) కూడా ఈ వివాదంపై ఎలాంటి చర్చలూ అవసరం లేదని స్పష్టం చేసింది.

కాగా.. రవిశంకర్‌ ముందు తన ప్రణాళికేంటో ఆయన చెప్పాలని ఏఐఎంపీఎల్‌బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వలీ రెహ్మానీ డిమాండ్‌ చేశారు.  12 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఓసారి యత్నించారని, అయితే  వివాదాస్పద స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని సూచించారని గుర్తుచేశారు. ఈసారి ఆయన ఏ ఫార్ములాతో వస్తున్నారో చెప్పాలని డిమాండం చేశారు. రవిశంకర్ ఓ జోకర్ అని ఆయన మధ్యవర్తిత్వాన్ని అమోదించబోమని ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు.

కోర్టులో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పోరాడుతున్న సుబ్రమణియం స్వామీ ఆవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ కి ఒప్పుకునే ప్రసక్తేలేదన్నారు. గతంలో అలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయని ఆయన గుర్తు చేశారు. కాని, వాటి వల్ల ఫలితం లేదని అన్నారు. రామజన్మభూమిలో కాకుండా మసీదు ఎక్కడైన నిర్మించుకోవాలని కుండబద్దలు కొట్టారు. దీనికి తోడు
వచ్చే సంవత్సరం నాటికి రామాలయ నిర్మాణం చేపట్టి తీరుతామని చెబుతున్నారు.

పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు 1992లో బాబ్రీ మసీదుని కరసేవకులు కూల్చివేశారు. మసీదుని కూల్చివేసిన స్ధలంలో రామాలయం నిర్మించాలని హిందూ సంస్ధలు, మసీదుని తిరిగి కట్టితీరాలని ముస్లిం సంస్ధలు న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే వివాదాస్పద స్ధలంలో గుడి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చారు. యోగి ఆదిత్యనాథ్ సైతం ఇప్పటికే రామమందిర నిర్మాణం చేపట్టబోయే స్ధలంలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో రవిశంకర్ ఎంట్రీ ఇవ్వడం, కొంతమంది మద్దతు తెలుపుతుండటం, మరికొంతమంది వ్యతిరేకిస్తుండటంతో ఈ సమస్యకు ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుందా లేదా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

- Advertisement -