కన్నులపండువగా ‘రథసప్తమి’

269
rathasapthami
- Advertisement -

ప్రపంచ నాగరికతలను పరిశీలిస్తే అంతా సూర్యభగవానుడిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించిన దాఖలాలు కనిపిస్తాయి. సమస్త ప్రాణకోటికి జీవనాధారం సూర్యభగవానుడని గ్రహించి తమను చల్లగా చూడమని అనునిత్యం పూజించారు. సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి ఆరాధించారు.ఫలితంగా ప్రాచీనకాలం నుండి సూర్య దేవాలయాలు తమ వైభవాన్ని కోల్పోకుండా వెలుగొందుతూ ఉన్నాయి.

అలాంటి సూర్యభగవానుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే రోజుగా ‘రథసప్తమి’ పిలవబడుతోంది. రథసప్తమికి ఎంతో విశిష్టత ఉంది. లోకాన్ని ఆవరించిన చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం సూర్యుడు వేయి కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఈ వేయి కిరణాలలో ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇందుకు సంకేతంగా ఏడు గుర్రాలను కలిగిన రథంపై దర్శనమిస్తాడు సూర్యభగవానుడు. సూర్యుడు తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి తన బాధ్యతలను చేపట్టిన రోజే ‘రథసప్తమి’ గా చెప్పబడుతోంది.

రథసప్తమి రోజున ప్రసరించబడే సూర్యకిరణాలు, అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన జిల్లేడును విశేషమైన రీతిలో ప్రభావితం చేస్తాయి. అందువలన ఈ రోజున జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని నమ్మకం.

కళియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ ఉత్సవం, ఏ వేడుక, ఏ ఊరేగింపులు జరిగినా అది వైభవోపేతమే.  బ్రహ్మోత్సవాల స్థాయిలో టిటిడి ప్రతిఏటా….సూర్య భగవానుని పుట్టిన రోజైన రధసప్తమీ రోజున ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తు వస్తోంది. ప్రతీ ఏటా నిర్వహించే రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలు, మంగళధ్వనులతో ఆదిత్యునికి మహాక్షీరాభిషేక సేవ చేశారు. రధసప్తమీ రోజున తిరుమలలో స్వామి వారు సప్తవాహనాలపై ఊరేగుతారు. ఏడాదికోకసారి వచ్చే ఈ  వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

- Advertisement -