డిసెంబర్ 5న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. కథానాయికగా జీవితం మొదలెట్టిన ఆమె తమిళనాడు సీఎంగా, తమిళ ప్రజానికానికి అమ్మగా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ఆమె మరణం తరువాత ఆమె జీవితచరిత్రను తెరకెక్కించడానికి కొంత మంది దర్శకులు రంగంలోకి దిగుతున్నారు. ఈ పాత్రకు ఎవరు సూటవుతారా అని దర్శకులు హీరోయిన్ కోసం వేటాడే పనిలో ఉన్నారు.
తాజాగా ఈ పాత్రపై రమ్యకృష్ణ పేరు తెరమీదికొచ్చింది. స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి లెడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లలో అన్ని విధాలుగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. నాడు సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరిగా తాజాగా బహుబలిలో శివగామిగా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది.
అయితే ఇప్పుడు అమ్మలాగే అచ్చుగుద్దినట్లుగా ఉన్న రమ్యకృష్ణ ఫొటోలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌చేస్తుంది. అచ్చం అమ్మలాగే చీర కట్టు, గడియారం, ముఖ వర్చస్సు కొంచెం అటు ఇటు మార్చి జయలలితలాగే తీర్చిదిద్దారు. జయలలితను తమిళ ప్రజలు ఆప్యాయంగా అమ్మ అని పిలుచుకుంటారు. అందుకే సినిమా టైటిల్‌ను ‘మదర్’గా పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమానుపై తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తుందని, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో జయలలిత జీవిత గాథ సినిమాగా తెరకెక్కుతుందని కోలీవుడ్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది ఏ మేరకు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.
దేవుళ్ల సినిమా గెటప్‌లలో అప్పట్లో అభిమానులను మెప్పించిన రమ్యకృష్ణ…. తాజాగా శివగామిగా మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల రమ్యకృష్ణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా డ్రీమ్ రోల్ జయలలిత పాత్ర అని చెప్పకనే చెప్పింది. దీంతో జయలలిత జీవితచరిత్రను ఎవరు తెరకెక్కించడానికి ముందుకు వచ్చినా, ఆమె పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది. తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఫొటోను బట్టి చూస్తే జయలలిత పాత్రకు రమ్యకృష్ణ కరెక్ట్ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయట.
ఇప్పటికే జయలలిత జీవితగాథపై తన ఇష్టాన్ని ప్రదర్శించిన త్రిష. జయలలిత ఆసుపత్రి పాలైన దశలోనే.. జయ బయోపిక్ తీస్తే అందులో తను నటిస్తానని త్రిష చెప్పింది. నేను జయకు పెద్ద ఫ్యాన్‌ని అని తెలిపింది నటి త్రిష. ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమాపై ఏ ప్రకటన వెలువడలేదు.