రాష్ట్రపతి ఎన్నిక కోసం సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ పక్షాల తరపున రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ పక్షాల తరపున మీరా కుమార్ బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. నేటి (సోమవారం) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అన్ని చోట్ల నుంచి బ్యాలెట్ పెట్టెల్ని దిల్లీకే తీసుకువచ్చి, ఈ నెల 20న ఓట్ల లెక్కింపు చేపడతారు.పార్లమెంటులో ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక కారణముంటే, ఈసీ అనుమతితో వేరే పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.
రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.కోవింద్ ఎన్నికయ్యేందుకు స్పష్టమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో కలిపి ఎన్డీఏ కూటమికి ఉన్న ఓట్ల విలువ 5,37,683. అంటే కోవింద్ గెలుపు సాధించడానికి మరో 12వేలు మాత్రమే తక్కువ. టీఆర్ఎస్ బీజేడీ, వైకాపా, ఏఐఏడీఎంకేలో రెండు వర్గాలూ ఎన్డీఏకి మద్దతునిచ్చేందుకు వాగ్దానం చేసినందువల్ల ఆ కూటమికి గెలుపు నల్లేరుపై నడకేనని చెప్పవచ్చు. 2007లో ప్రతిభా పాటిల్ 6,38,116 ఓట్లు తెచ్చుకుంటే 2012లో ప్రణబ్ ముఖర్జీ 7,13,763 ఓట్లు సాధించారు. గత ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తే ఈసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఆ అవకాశం లభించింది.
గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో తలెత్తిన సిరా వివాదం నేపథ్యంలో ఈసారి ప్రత్యేక కలాలను వాడాలని ఈసీ నిర్ణయించింది. వూదా రంగు సిరాతో పనిచేసే ఈ కలాలకు ప్రత్యేక క్రమ సంఖ్య ఉంటుంది. ఈసీకి సిరా సరఫరా చేసే మైసూరు కర్మాగారమే వీటినీ సమకూర్చింది. ఓటింగ్ గది లోపల సొంత పెన్నులు వాడడం నిషేదించారు. ఇలా చేయడం ఇదే తొలిసారి. ఈ సారి రాష్ట్రపతి ఎన్నికకు లోక్‌సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ బాధ్యతను రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహించారు.
ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలకు ఒక రోజు ముందే అడ్వాన్స్ విషెస్ చెప్పేశారు. కోవింద్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్న కోవింద్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహయోగ్ (సహాయం) ఉంటుందని స్పష్టం చేశారు.