విదేశాలకు బ్లాక్ బాక్స్..ఊహాగానాలే!

3
- Advertisement -

అహ్మదాబాద్‌లో ఈ నెల ప్రారంభంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి పౌర విమానయాన మంత్రి కే. రామ్మోహన్ నాయుడు మంగళవారం స్పందించారు. బ్లాక్ బాక్స్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పరిశీలిస్తోంది. విదేశాలకు పంపనున్నట్టు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని ఆయన ఖండించారు.

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఒక హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మందితో సహా మొత్తం 270 మంది మృతి చెందారు. ఓ ప్రయాణికుడు మాత్రం సజీవంగా బయటపడ్డారు.

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ జూన్ 13న ఘటనాస్థలంలో నుంచి వెలికితీయబడింది. విమానం ప్రయాణ సమయంలో జరిగే ముఖ్యమైన సమాచారాన్ని ఇది రికార్డు చేస్తుంది. విమాన ప్రమాదాల కారణాలను తెలుసుకునే దర్యాప్తులో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

బ్లాక్ బాక్స్‌ను విదేశాలకు పంపిస్తారని వచ్చిన కొన్ని వార్తలపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..అవి అన్ని ఊహాగానాలే. బ్లాక్ బాక్స్ భారతదేశంలోనే ఉంది. ప్రస్తుతం AAIB దానిపై దర్యాప్తు కొనసాగిస్తోంది అన్నారు. బ్లాక్ బాక్స్ డేటా రికవరీ అనేది సాంకేతికపరమైన సమస్య..త్వరలోనే వివరాలు బయటకు వస్తాయన్నారు.

Also Read:విజయోత్సవాలు కాదు..సారీ చెప్పాలి!

- Advertisement -