పురాణాల ప్రకారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్తతీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమపావనులై ముక్తిమార్గం పొందుతారని నమ్మకం.
శ్రీరామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు.
ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి, సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం.ఈ పర్వదినంనాడు ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొంటారు.
Also Read:పార్టీకి నో క్రెడిట్.. ఏంటిది షర్మిల?