రంజాన్ మాసం..ప్రారంభం

472
Ramadan 2018
- Advertisement -

ముస్లింల అత్యంత పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు సంవత్సరమంతా ఎలా మెలిగినా రంజాన్‌ మాసంలో మాత్రం భక్తి శ్రద్ధలతో 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. క్రమం తప్పకుండా నమాజు (ప్రార్థనలు) చేస్తారు. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల నమ్మకం.

తెల్లవారు జామున ఉపవాస దీక్ష ప్రారంభించే సమయంలో ఫజర్‌కి నమాజ్‌, మధ్యాహ్నం జోహర్‌కి నమాజ్‌, సాయంకాలం అసర్‌కి నమాజ్‌, సాయంత్రం 6 గంటల నుంచి 9.30 గంటల మధ్య మగ్‌రీబ్‌కి నమాజ్‌, ఇషాకి నమాజ్‌ ఇవి ప్రతి రోజు చేసే ప్రార్థనలు. ప్రతీ మసీదులో వేర్వేరుగా అంటే కొన్ని చోట్ల 10 రోజులకు ఒక ఖురాన్‌, కొన్ని చోట్ల 5 రోజుల్లో, ఇంకొన్ని చోట్ల 15 రోజుల్లో, 25 రోజుల్లో ఒక ఖురాన్‌ను హాఫెజ్‌ (ఖురాన్‌ను కంఠస్థంగా చదివేవారు)లు వినిపిస్తారు. కొన్ని సందర్భాలలో ఒక్కరోజులో, మూడు రోజుల్లో కూడా వినిపిస్తారు.

రంజాన్‌ మాసంలోని 30 రోజుల్లో అత్యంత ప్రధానమైంది 26వ రోజా పాటించే దినం. ముస్లింల పవిత్ర గ్రంధమైన దివ్య ఖురాన్‌ ఈ రోజే ఆవిర్భవించిందని ముస్లింలు నమ్ముతారు. 26వ రోజు రాత్రిని షబ్‌-ఎ-ఖదర్‌గా పిలుస్తారు. ఆ రాత్రి ముస్లింలందరూ జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. అలా చేస్తే పూర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

Image result for ramzanరంజాన్‌ మాసంలో ఇంకో ఘట్టం జుమాతుల్‌ విదా(చివరి శుక్రవారం). దీంతో నెల ముగుస్తుందని అర్థం. ఈ జుమా నమాజుకు అందరూ మసీదులకు చేరుకుని ప్రార్థనలు జరుపుతారు. ఆవేదనతో రంజాన్‌కు వీడ్కోలు పలుకుతారు.

రంజాన్‌ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ముస్లిం లు ఆయా ప్రాంతాల్లోని మసీదులను ప్రార్థనల కోసం ప్రత్యేక హంగులతో ముస్తాబు చేశారు. మసీదులు నూతన శోభతో ఉపవాస ప్రార్థనల కోసం సిద్ధమయ్యాయి. మసీదు లకు రంగులు వేయడంతో పాటు విద్యుత్‌ దీపాలంకరణ లు, మరమ్మతులు పూర్తి చేశారు.

- Advertisement -