బీజేపీ అధ్యక్షుడిగా రాంమాధవ్‌…!

416
ram madhav
- Advertisement -

రెండోసారి తిరుగులేని మెజార్టీతో అధికారం దక్కించుకుంది బీజేపీ.మోడీ-అమిత్ షా ద్వయానికి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. ఇక బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషించారు అపర చాణక్యుడు అమిత్ షా. ఈ నేపథ్యంలో ఆయనకు మోడీ కేబినెట్‌లో కీలక పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలకు బలం చేకూరేలా మోడీ సైతం అమిత్‌ షా వ్యూహాలతో పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన స్ధాయిని మరింతగా పెంచేశారు.

దీంతో అమిత్ షా…మోడీ మంత్రివర్గంలో చేరితే కొత్త బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అన్నదానిపై విస్తృత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాం మాధవ్‌. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాంమాధవ్‌ పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల మెరుగైన ఫలితాలు సాధించడంలో కీ రోల్ పోషించారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రాం మాధవ్‌ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. మైసూరు యూనివర్శిటీ నుంచి రాజనీతిశాస్త్రంలో పీజీ చేశాడు. చిన్నప్పటి నుండే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 2014 లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రాంమాధవ్‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పడం ద్వారా దక్షిణాదిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అధ్యక్షుడిని మార్చని పక్షంలో షాకు కేంద్రమంత్రి పదవితో పాటు బీజేపీ చీఫ్‌గా కొనసాగే అవకాశం ఉంది. మొత్తంగా ఒకవేళ రాం మాధవ్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైతే తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ పార్టీ చీఫ్‌గా ఎన్నికైన మూడో వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు. అంతకముందు వెంకయ్యనాయుడు,బంగారు లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు.

- Advertisement -