మొన్న శశికళ, నిన్న నయీం, మరి నేడు? నాథూరామ్ గాడ్సే… వీరి పేర్లు ఇలా చెప్పుకుంటూ పోతున్నారేంటీ..అనుకుంటున్నారా? అదేంలేదండీ.. ఇప్పుడు ఈ పేర్లు ఎందుకంటే..వీరి కథతో సినిమా రాబోతోంది. ఈ సినిమాలు తీసేది మాత్రం రాంగోపాల్ వర్మనే. అవును ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెప్పాడు. కానీ ఇప్పటి వరకు వాటి అప్‌డేట్స్ మాత్రం లేవు.
చకచకా అలా పేర్లు చెప్పేసి, ఇప్పుడు గమ్మునున్నాడు వర్మ. సినిమా చేస్తాడా లేదా అన్నది తర్వాత.. ప్రకటనలైతే ఘనంగా ఇస్తుంటాడు వర్మ. ఇలా అనౌన్స్‌మెంట్ వరకే పరిమితమైన వర్మ సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆయన మరో వివాదాస్పద సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే మీద తాను సినిమా తీయబోతున్నట్లు వర్మ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు.
గాడ్సే గురించి తెలుసుకోవాలని తనకు ఎప్పట్నుంచో చాలా ఆసక్తి ఉందని.. ముందు తాను అతడి గురించి పూర్తిగా తెలుసుకుని.. ఆపై సినిమా తీస్తానని వర్మ తెలిపాడు. గాంధీ మీద తుపాకీ గురి పెట్టినపుడు గాడ్సే ఫీలింగ్స్ ఎలా ఉండి ఉంటాయన్నది తనలో ఉత్కంఠ రేకెత్తిస్తోందని.. దీంతో పాటు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉందని.. త్వరలోనే తన పరిశోధన ఆరంభమవుతుందని వర్మ తెలిపాడు.
ఐతే వర్మ నిజంగా గాడ్సే మీద సినిమా తీస్తాడా అన్నది డౌటు. మామూలుగా ఏదైనా టాపిక్ మీద చర్చ నడుస్తున్నపుడు వర్మ ఎగ్జైట్ అయిపోయి దాని మీద సినిమా తీస్తానని అనడం రివాజు. ఈ మధ్య తమిళనాట రాజకీయాలు వేడెక్కినపుడు శశికళ మీద సినిమా అన్నాడు.
అంతకుముందు నయీం చనిపోయినపుడు ‘నయీం’ సినిమాను అనౌన్స్ చేశాడు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ‘రెడ్డి గారు పోయారు’ అంటూ ఓ సినిమా ప్రకటించాడు. కానీ ఇవేవీ కూడా కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడైనా వర్మ తాను అనౌన్స్ చేసిన సినిమాలు తీస్తారో లేదో చూడాలి.