మాజీ ముఖ్యమంత్రి,సినీ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒకటి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మరొకటి తేజ-బాలయ్య కాంబినేషన్‌లో రాబోతుంది. ఈ నేపథ్యంలో వర్మ తెరకెక్కించే సినిమా ఎలా ఉండబోతుందోనన్న సందేహం నెలకొంది.
ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ ను నిర్ణయించినట్టుగా ప్రకటించిన వర్మ, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఎన్ని విమర్శలు వస్తున్న పట్టించుకోని వర్మ..తాజాగా తనదైన శైలీలో స్పందించాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది అంటూ కామెంట్ చేశాడు వర్మ.
ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సినిమాను 2018 ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో తను ఎన్టీఆర్ కుటుంబీకులను ఎవ్వరినీ కలవను అని వర్మ కుండబద్ధలు కొట్టాడు.
ఎన్టీఆర్ తో కుటుంబీకులకు ఎమోషనల్ బాండేజ్ ఉంటుందని, కాబట్టి వారు చెప్పే విషయాలపై ఆ ప్రభావం ఉంటుందని.. అందుకని వారితో కథ గురించి చర్చించే ఉద్దేశం లేదని వర్మ స్పష్టం చేశాడు. ఎన్టీఆర్‌కు సహాయకులుగా పని చేసిన వాళ్లు, ఎన్టీఆర్ ఇంట్లో వంటమనుషులు, డ్రైవర్లను కలుస్తానని, ఇప్పటికే కొంతమందిని కలిశానని వర్మ చెప్పాడు. అలాంటి వారికే ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహారాలపై, ఇంట్లో వ్యవహారాలపై అవగాహన ఉంటుందని వర్మ చెప్పుకొచ్చాడు.