మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దృశ్యకావ్యంలా మలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు సుకుమార్. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్తగా 1985 నాటి కాలాన్ని తలపిస్తూ సుకుమార్ తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుత రోజుల్లో గతాన్ని చూపించాలంటే దర్శకుడికి చాలా ఒత్తిడికి మించిన పని. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్నామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కనిపిస్తే చాలదు ఆ అనుభూతికి లోనయ్యేలా చేయాలి. అప్పుడే ఆ మూవీ హిట్ అవ్వడమే కాదు దర్శకుడి ప్రతీభ బయటపడుతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ..చిన్న సిన్ కూడా మొత్తం సినిమా మూడ్ ని చేంజ్ చేసే ప్రమాదం ఉంటుంది.
ఈ నేపథ్యంలో 1985 కాలంలోకి రంగస్థలం అనే ఊహాజనితమైన ఊరికి తీసుకెళ్లడానికి కష్టపడుతున్నాడు సుకుమార్. రంగస్థలం అనేది ఎక్కువగా నాటకాలకు సంబందించిన పేరు అని మనకు తెలుసు. రంగస్థలంపై ఎన్నో హావభావాలని నటులు కనబరుస్తారు. ప్రతి ఒక్క ఫీలింగ్ రంగస్థలంపై ఉంటుంది. అయితే రంగస్థలం అనే ఊరిలో సుకుమార్ చూపించే ఫీలింగ్స్ ఎలాంటి అనుభవాలను కలిగిస్తాయో అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.

మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ను వైజాగ్ లో…. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరిలో పడవ నడిపే చిట్టిబాబుగా చరణ్ నటిస్తుండగా, రామలక్ష్మి అనే పేదింటి పిల్లగా సమంత నటిస్తోంది. ప్రేమకథతో పాటు బలమైన రాజకీయ నేపథ్యం కూడా సినిమాలో ఉండనుందని టాక్.
ఇక ఇటీవల విడుదల చేసిన సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘ఎంత సక్కగున్నావే’ సంగీత ప్రేమికుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్లో రికార్డ్ స్థాయి క్లిక్స్ దక్కించుకున్న ఈ పాటలోని సంగీతం ఒక ఎత్తైతే రచయిత చంద్రబోస్ రాసిన సాహిత్యం మరొక ఎత్తు. అచ్చమైన తెలుగు పదాలతో, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా, 80ల కాలంనాటి పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టేలా చంద్రబోస్ చక్కగా చూపించారు. మొత్తంగా సుకుమార్ చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

