రకుల్ ప్రీత్ సింగ్.. అసలే అమ్మాయిది జిమ్ బాడీ. ఎప్పుడూ ఫిట్ నెస్ ని కాపాడుకొంటూ ఉంటుంది. దానికి తోడు ఆర్మీ కుటుంబం నుంచి వచ్చింది. తనతో పెట్టుకొంటే ఎవరైనా సరే.. చెడుగుడు ఆడేసుకొంటుంది. ఓ పోకిరిని హీరోలా పరిగెట్టించి పరిగెట్టించి మరీ కొట్టిందట. అయితే ఇప్పుడు కాదు. టాప్ హీరోయిన్లుగా ఉండే వారి నోటి నుంచి గతానికి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రావు. కానీ.. రకుల్ తీరు వేరు. ఓపెన్ గా చెప్పేస్తుంది. సెకండ్ హీరోయిన్ గా చేయటానికి సైతం ఓకే అన్న రోజుల్ని సైతం వివరంగా చెబుతుంది.
తాజాగా ఒక మీడియా సంస్థకు చెందిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రకుల్ పాల్గొంది.రీల్ లైఫ్ లో సరే.. రియల్ లైఫ్ లో ఎవరినైనా చెప్పుతో కొట్టారా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. తాను ఒకసారి కాదు.. రెండుసార్లు చెప్పుతో కొట్టినట్టు పేర్కొంది. కాలేజీ రోజుల్లో ఒకసారి చెప్పుతో కొట్టానని.. రెండోసారి ఫోరం మాల్ లో కొట్టినట్లుగా చెప్పింది.
తన తమ్ముడితోనూ.. ఒక స్నేహితుడితోనూ ఫోరం మాల్ కు సినిమాకు వెళ్లానని.. ఏదో తీసుకొని వెనక్కి తిరిగే సమయానికి ఒక వ్యక్తి ముఖానికి దగ్గరగా రావటంతో ఒళ్లు మండిపోయినట్లు చెప్పింది. ఏం చేస్తున్నావ్ అంటే.. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని అనటంతో కోపంతో గార్డ్స్ ను పిలిచి అతన్ని బయటకు పంపాలని గట్టిగా చెప్పానని తెలిపింది రకుల్. తనకు సాధారణంగా కోపం రాదని.. కానీ ఒకసారి వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్ధలైనట్లేనని చెప్పుకొచ్చింది.