డ్రగ్స్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో నగదు లావాదేవీలపై ఈడీ హైదరాబాద్‌లో విచారణ కొనసాగుతోంది. టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి చార్మిని విచారించిన ఈడీ వారి నుంచి పలు వివరాలు రాబట్టింది. ఇక ఈ రోజు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఆమె చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి జరిగిన లావాదేవీలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు స్పష్టం చేసింది.
రకుల్ ప్రీత్ ఈ నెల 6న విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందుగా నోటీసులు జారీ చేసింది. అయితే, ఆ రోజు తనకు షూటింగు ఉందని చెప్పడంతో ఆమెను ఈ రోజే అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ఇచ్చిన కీలక వివరాల ఆధారంగా ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తోంది. అయితే ఏయే విషయాలపై ఆమెను ప్రశ్నించనున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక సెప్టెంబర్-08న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్‌క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ కేసును తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. కోర్టులో చార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఈ సమయంలో ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.