కర్నాటక రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కన్నడ రాజకీయ అనిశ్చితికి కాంగ్రెస్,జేడీఎస్ కారణమంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా అధికార పార్టీ సైతం అంతే ఘాటుగా బీజేపీని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక రాజకీయాలు ఇవాళ రాజ్యసభను స్తంభింపజేశాయి.
కాంగ్రెస్ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ గంటసేపు వాయిదా పడింది. వెల్‌లోకి దూసుకువెళ్లిన కాంగ్రెస్ సభ్యులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో చిచ్చు రావడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. 12 గంటలకు మళ్లీ సమావేశమైన తర్వాత కూడా సభ్యులు హోరెత్తించారు. దీంతో సభను మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
ఇక ప్రస్తుతం కర్ణాటకలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో తనకెలాంటి సంబంధం లేదని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాజీనామాల విషయంలో రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.