భారత్ పై తరుచుగా దాడులు చేస్తు..భారత్ లో మతకల్లోలాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతున్న పాకిస్థాన్ ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించాడు. మతం ఆధారంగా భారత్‌ను విభజించాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నదని, కానీ అది ఎన్నటికీ జరగబోదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో కథువాలోని ఆయన ఆదివారం ప్రసంగించారు. ఉగ్రవాదం పిరికిపందల ఆయుధం మాత్రమేనని పాక్‌పై మండిపడ్డారు. సరిహద్దుల్లో ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినా దీటుగా సమాధానం ఇస్తామని ఆయన తేల్చిచెప్పారు.
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రస్తావిస్తూ ‘మా ప్రభుత్వం భారత్‌ను ఎవరి ముందు తలవంచుకోనివ్వదు. పాకిస్థాన్ ఎలాంటి దాడులు చేసినా వాటిని దీటుగా తిప్పుకొడతాం’ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాలుగుసార్లు భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిందని, అన్నిసార్లు ఆ దేశానికి తగిన బుద్ధి చెప్తామని పేర్కొన్నారు. ‘(1971లో) పాకిస్థాన్ రెండు దేశాలుగా చీలిపోయింది. ఒకవేళ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుంటే ఆ దేశం త్వరలోనే పదిముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది’ అని రాజ్‌నాథ్ అన్నారు.