ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నేడు పదవీ విరమణ చేయనున్న రాజీవ్‌శర్మకు సచివాలయంలో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. రాజీవ్ శర్మ వీడ్కోలు సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. రాజీవ్ శర్మకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు సీఎం.
ఈ సంధర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… 2014 జూన్ 2న కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటీ సీఎస్‌గా రాజీవ్ శర్మ ఛార్జ్ తీసుకున్నారు. ఆ తరువాత ఉదయం 8 గంటలకు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు ఎన్నో కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన ఫైల్ ఆయనే రాసుకున్నారు. రాజీవ్ శర్మనే రాజ్ భవన్‌కు వెళ్లి కార్యక్రమాలన్నీ సాఫీగా జరిగేలా చూశారు. ఆ తరువాత ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తరువాత ఉద్యోగుల పంపీణికి సంబంధించి, కరెంట్ పంపిణీకి సంబంధించి ఇతర విషయాల్లొ ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ రాజీవ్ శర్మ ఎంతో ఓపికగా ఉన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ సంవత్సరన్నరలోనే ఎన్నో అవార్డులు తీసుకుంది. ఇంత తొందరగా పరిస్థితులను చక్కదిద్దిన ఘనత రాజీవ్ శర్మదే.
తెలంగాణ ఏర్పాడ్డక సరిగా స్టాటిస్టిక్స్ లేకపోవడంతో కుటుంబ సర్వే చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనాభా గణన కొన్ని రోజుల పాటు చేస్తారు. అలాంటిది కుటుంబ సర్వే ఒక్క రోజులో చేయడం అసాధ్యం అని అందరన్నారు. అయితే రాజీవ్ శర్మ దీనిపై కొన్ని వారాల పాటు ఎంఆర్‌వో, ఎంపీడీఓల నుండి కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరితో సమీక్ష నిర్వహించారు. అలా కుటుంబ సర్వేలో ఆయన కీలక పాత్ర పోషించారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా తెలంగాణకు వచ్చి ఈ సర్వే గురించి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనప్పటీకి ఇతర రాష్ట్రాల వాళ్లు మన అనుభవాలను తెలుసుకుంటున్నారంటే రాజీవ్ శర్మ లాంటి ప్రధాన కార్యదర్శులకు మనకుండడం గొప్ప విషయం. కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా ఆయన కీలకంగా పనిచేశారన్నారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు రూపొందించడంలో రాజీవ్ శర్మ కీలకంగా పనిచేశారు. అప్పటి హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ శర్మకు తెలంగాణ డ్రాఫ్ట్‌కు సంబంధించిన ప్రతీ అంశంపై అవగాహన ఉంది. తెలంగాణకు రాజీవ్ శర్మ సేవలు ఎప్పుడూ అవసరమే. అందుకే రాజీవ్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్ సలహాదారుగా నియమిస్తున్నట్టు కేసీఆర్ ఈ సంధర్బంగా ప్రకటించారు.
రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నన్నారు. సీఎం కేసీఆర్ తనను ఇలా గుర్తుంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సివిల్ సర్వీస్ అధికారులకు ఇలా సన్మానం చేయడం గొప్పవిషమన్నారు. అందుకు కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కొత్త పథకాలు ప్రవేశపెట్టారన్నారు. సివిల్ సర్వీసు అధికారులు సరిగా పనిచేస్తే.. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజలకు చేరువ అవుతాయని తెలిపారు.
ఈ సభకు డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీతోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, నాయిని నర్సింహారెడ్డి, జగదీష్ రెడ్డి, లక్మారెడ్డి, ఇతర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.