వరుస సినిమాలతో జోరుమీదున్నసూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా రాజకీయ రంగంలోనూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రజినీ మూడు ఛానల్స్ ప్రారంభించనున్నట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు తనకు సొంత ఛానళ్ల అవసరం ఉందని రజనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా రజనీకాంత్..రజినీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ పేరుతో మూడు ఛానల్స్‌ను ప్రారంభించనున్నారట రజినీ. వీటికి సంబంధించిన లోగోలను కూడా రజనీ ప్రతినిధులు రిజిస్టర్ చేయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక రజినీ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై అందరిలో దృష్థి నెలకొంది.
జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజినీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే కమల్ తన పార్టీ పేరు ఎజెండా ప్రకటించగా, రజినీకాంత్ తన పార్టీకి ‘మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న ప్రకటించాడు రజినీ.
అయితే పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్‌కి రజినీకాంత్ అప్పగించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ చానల్స్ ప్రారంభించే ప్రక్రియ కూడా వీరే బాధ్యత వహించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన పేటా సంక్రాంతికి రానుండగా,ఆ తర్వాత మురుగదాస్‌తో తదుపరి సినిమా చేయనున్నాడు.