శబరిమల వివాదంపై స్పందించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటించిన 2.0 ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రజనీ అయ్యప్ప భక్తులకు మద్దతు తెలిపారు. పురాతన ఆలయ సంప్రదాయ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదన్నారు. ఇది సున్నితమైన సమస్య అని భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చంటూ సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తీర్పు తర్వాత రెండుసార్లు గుడి తలుపులు తెరిచినా.. ఒక్క మహిళ కూడా ఆలయంలోకి అడుగుపెట్ట లేకపోయింది. కొందరు మహిళల పోలీసుల రక్షణతో గుడి దగ్గరి వరకు వెళ్లినా.. తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో వెనుదిరిగారు.
ఈ నేపథ్యంలో తీర్పుపై రివ్యూకు అంగీకరించింది సుప్రీం కోర్టు. తీర్పు అనంతరం కేరళలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనగా ఈ తీర్పును సమీక్షించాలని 49 పిటిషన్లు దాఖలయ్యాయయి. వీటన్నింటినీ జనవరి 22న ఓపెన్ కోర్టు(ప్రజల సమక్షంలో) విచారించనుంది.