దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తమిళనాడు రైతులను ఆదుకుంటానని వారికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.. ఆదివారం ఆయన చెన్నైలో నేషనల్ సౌత్‌ఇండియన్ రివర్స్ ఇంటర్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే దిల్లీలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్ అడిగి తెలుసుకున్నారు.
నదుల అనుసంధానం కోసం రజినీ విరాళంగా ప్రకటించిన ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ సోమవారం ప్రకటించారు. అయితే నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గంగా-కావేరి నదుల అనుసంధానానికి రజనీకాంత్ సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే రజినీ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు రెండున్నర నెలలకు పైగా తమిళ రైతులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, కరవు సాయం అందించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రైతుల ఆందోళనను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.