సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి పలు అంశాలను ప్రజలతో పంచుకున్నారు. రాజకీయాల్లో తన పాత్రపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన ఆలోచనలను స్పష్టంగా వివరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థ మారాలని, దీనిని సరిదిద్దవలసి ఉందన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలనుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి తాను ఆలోచించడం లేదన్నారు.
తన పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. విద్యావంతులు, నిజాయితీపరులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదు. నేను పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటాను. 45 ఏళ్లుగా సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావం చూపుతాయి’ అని తెలిపారు.
‘1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి నేను ఆలోచించలేదు. ఈ విషయంపై ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను’ అని తెలిపారు. ‘నేను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నాను. నా అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అన్ని ఊహాగానాలకు నేడు ఫుల్స్టాప్ పెడుతున్నాను. 2016-17లో తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించింది. మంచివారు రాజకీయాల్లోకి రావట్లేదు’ అని చెప్పారు.