సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో వండర్ బార్ ఫిలింస్ ప్రై.లి, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై ధనుశ్ నిర్మించిన చిత్రం `కాలా`. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 7న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కరికాలుడుగా రజనీకాంత్ నట విశ్వరూపాన్ని తెరపై వీక్షించాలని అభిమానులు, ప్రేక్షకులు అతృతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ , నిర్మాత ధనుశ్, చిత్ర దర్శకుడు పా.రంజిత్, హ్యుమా ఖురేషి, ఈశ్వరీరావు, ఎ.ఎం.రత్నం, లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధి కరుణాకరణ్, ఎన్.వి.ప్రసాద్, దిల్‌రాజు, మారుతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా….మాట్లాడిన రజనీ తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందడం నా భాగ్యం అని తెలిపారు. ‘1978 నా తొలి తెలుగు సినిమా `అంతులేని కథ` విడుదలైంది. తర్వాత `అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, తొలిరేయి గడిచింది` ఇలా 15-20 సినిమాలు తెలుగులో చేశాను. తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. బ్రేక్ వచ్చింది. తెలుగులో సినిమాలు చేయాలా? తమిళంలో సినిమాలు చేయాలా? అనే ప్రశ్న వచ్చింది. అయితే కె.బాలచందర్ దర్శకత్వంలో నేను తమిళంలో తొలి సినిమా చేశాను. ..కాబట్టి తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాను. అయితే తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమను చూపించారో.. అంతే ప్రేమను తెలుగు ప్రేక్షకులు చూపిస్తూ వచ్చారు… వస్తున్నారు. అది నా భాగ్యం అన్నారు.
`పెదరాయడు`, `భాషా, నరసింహా, ముత్తు, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీ`లతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. సీనియర్ ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు ఆయన్ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఈ సమయంలో ఆయన్ను మిస్ అవుతున్నాను. చాలా గుర్తుకొస్తున్నారు. అది ఎందుకో అందరికీ తెలిసిందే. కె.బాలచందర్‌గారి తర్వాత నా గురువు దాసరి నారాయణరావుగారు. ఆయన్ను కూడా ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నాను. చాలా పెద్ద మనిషి.. పెద్ద దర్శకుడు. ఓ బిడ్డలా నన్ను ప్రేమించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ధనుశ్‌గారు ఇంతకు ముందు ఒకే రజనీకాంత్ అని చెప్పారు.
అయితే ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే బాలకృష్ణ, ఒకే వెంకటేశ్.. ఇలా అందరూ ఎవరికీ వారు ప్రత్యేకం. కేవలం అవకాశమే అందరినీ పెద్ద వ్యక్తులుగా చేస్తుంది. ఇండస్ట్రీలో దొరికే అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవకాశం రావడం అదృష్ఠం. అవకాశం రావడాన్ని దేవుడుపై నమ్మకం లేనివారు లక్ అని అంటే.. దేవుడిపై నమ్మకం ఉండేవాళ్లు దేవుడి ఆశీర్వాదం అంటారు. ఏ రంగం అయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. కష్టపడి.. డేడికేషన్‌తో పనిచేస్తే దానికి ప్రతిఫలం దొరుకుతుంది. రంజిత్‌తో ఇంతకు ముందు కబాలి సినిమా చేశాను. ఆ సమయంలో రజనీలాంటి హీరో యువ దర్శకుడితో సినిమా చేయడమేంటని చాలా మంది అన్నారు.
అయితే రంజిత్ కథ చెప్పినప్పుడే నేను ఇంప్రెస్ అయ్యాను. రంజిత్ `కబాలి`ని చక్కగా డైరెక్ట్ చేశారు. దాంతో మళ్లీ మేమిద్దరం కలిసి మా అల్లుడు ధనుశ్ నిర్మాణంలో కాలా సినిమా చేశాం. నేను సినిమాను రెండుసార్లు చూశాను. కమర్షియల్‌గానే కాదు.. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. రియాలిటీని మిక్స్ చేసి కమర్షియల్ సినిమాను తెరకెక్కించడం రంజిత్ స్పెషాలిటీ. చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఏషియాలోనే చాలా పెద్ద స్లమ్ ధారావి. ఆ స్లమ్‌లోని మనుషుల జీవితం ఎలా ఉంటుంది? వారికి ఎలాంటి సమస్యలుంటాయి? అనే అంశాలతో సినిమా చేశాం. సాధారణంగా హీరో క్యారెక్టర్‌కో, మరో క్యారెక్టర్‌కో ప్రాధాన్యత ఉంటుంది. కానీ కాలా సినిమాలో ఐదారు క్యారెక్టర్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ మనకు గుర్తుంటుంది. ఎమోషనల్ అంశాలతో పాటు స్లమ్‌లో ఉండేవాళ్ల సమస్యలేంటని ఈ సినిమాలో చక్కగా చెప్పారు. సంతోశ్ నారాయణ్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈశ్వరీరావు , హ్యూమా ఖురేషీ అద్భుతంగా నటించారు. ధనుశ్ నిర్మాతగా ఎలా చేస్తారో అనే సందేహం ఉండేది. నేను చక్కగా నటించడమే కాదు.. చక్కగా సినిమాను నిర్మిస్తానని ప్రూవ్ చేశారు ధనుశ్. డెఫనెట్‌గా సినిమా నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది” అన్నారు.