బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు జేడీఎస్ అధినేత కుమారస్వామి నూతన ముఖ్యమంత్రిగా 23న ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఆయన ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత అధికారం కోసం బీజేపీ.. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొన్ని రోజులుగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని మరింత రక్తికట్టించాయి. చివరికి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అధికారంతోపాటు తమ పార్టీ పరువు, ప్రతిష్టను కూడా పోగొట్టుకుంది.
ఈ అంశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న కర్ణాటకలో జరిగిన అనూహ్య సంఘటనను చూసి ప్రజాస్వామ్యం గెలిచిందని అనుకున్నా. బలనిరూపణలో నెగ్గడానికి గవర్నర్ 15 రోజులు సమయం ఇవ్వడం, అందుకు భాజపా మరింత సమయం కోరడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్లుగా ఉంది. బల నిరూపణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ధన్యవాదాలు. ఆ తీర్పు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టింది’ అని అన్నారు.
అంతేకాదు తమిళనాడులో 2019లో జరగబోయే ఎన్నికల గురించి మాట్లాడుతూ..‘ఎన్నికలు ప్రకటించినప్పుడు నేను పోటీ చేస్తానా? లేదా? అన్న విషయాన్ని వెల్లడిస్తాను. నా పార్టీని ఇంకా ప్రారంభించలేదు. అయినా మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని పేర్కొన్నారు రజనీ.