నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని స్పష్టం చేశారు మాజీ మంత్రి,ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో పాలకవర్గం సమావేశంలో మాట్లాడిన ఈటల..అగ్ని ప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయివేటు సంస్థ కాదు,వ్యాపార సంస్థ కాదు,పేద ప్రజల కోసం పని చేస్తోందన్నారు. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తాము అనుకోవడం లేదని ఈటల అన్నారు. ఓ షాపు వద్ద ఎవరో కాల్చిన సిగరెట్ వేయడం వల్లే మంటలు వ్యాపించినట్లు తమకు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిలో కుట్రకోణం ఉందా? లేదా? అన్నది పోలీసులు తేలుస్తారని అన్నారు.
ఎగ్జిబిషన్ కారణంగా రోజూ ట్రాఫిక్ జామ్ జరగడంతో దీని నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. సహాయచర్యలు పూర్తిచేసి రెండ్రోజుల్లో ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రమాదంపై రెండ్రోజుల్లో నివేదిక వస్తుందని.. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలన్నది ఆలోచిస్తామన్నారు.