ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ బోణీ చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 149 పరుగులు చేసింది. ఇక అంతకముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఔటైన విధానం చర్చకు దారితీసింది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ సామ్సన్ వైపు వెళ్లింది. అతడు దానిని వదిలేయగా, బంతి గాల్లోకి లేవడంతో మొదటి స్లిప్‌లోనే ఉన్న పడిక్కల్ దానిని అందుకున్నాడు. అయితే పడిక్కల్ క్యాచ్ తీసుకునే ముందు బంతి నేలను తాకిందనే అనుమానంతో విలియమ్సన్ క్రీజ్ నుంచి కదల్లేదు. బంతి నేలను తాకిన తర్వాత పడిక్కల్ చేతుల్లో పడినట్లు కనిపించింది. కానీ అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో నిరాశగా హైదరాబాద్ కెప్టెన్ వెనుదిరిగాడు.
వాస్తవానికి ఆ బాల్ గ్రౌండ్‌కు తాకింది. అయితే థర్డ్ అంపైర్ మాత్రం బౌలర్‌కు ఫేవర్‌గా డిసిషన్ ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! అనవసరంగా బలయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.