సిరిసిల్లలో త్వరలో అపెరల్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, టెక్స్టైల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం కేటీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిరిసిల్ల పట్టు చీరెలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు.
ఏటా చీరెల పంపిణీకి రూ.300కోట్లు బతుకమ్మ చీరెల కోసం వెచ్చిస్తున్నామన్నారు. నేతన్నలకు రూ.5లక్షల బీమా పథకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. చేనేత కార్మికులకు 40 శాతం, పవర్లూమ్ కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. 60 ఎకరాల్లో ఏర్పాటు చేసే పార్క్‌లో బీడీలు చుట్టే మహిళలకు పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
తమిళనాడు తిరుప్పూర్‌కు వెళ్లి అక్కడి వస్త్ర పరిశ్రమను పరిశీలించి రావాలని పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్‌కు సూచించారు. చేతనైన స్థాయిలో మంచి బతుకమ్మ చీరెలను ఉత్పత్తి చేస్తున్నామన్న కేటీఆర్.. నేతన్నల అభివృద్ధికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతామన్నారు.