తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే గర్వంగా ఉందన్నారు దర్శకుడు రాజమౌళి. శుక్రవారం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రాజమౌళి మీడియా మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో ఇది వరకు భారత్ సినిమా అంటే షారుక్ ఖాన్ లాంటి ఒకరిద్దరు నటులు మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ‘బాహుబలి’ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘మాయాబజార్’ సినిమా నన్ను బాగా ఆకట్టుకుంది. అప్పుడే ఫాంటసీ చిత్రాలపై నా దృష్టి మళ్లింది. ఆ సినిమాలోని ప్రతి షాట్ గురించి ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేవాడ్ని, చాలా మందితో మాట్లాడేవాడ్ని. ఈ సినిమా తీయడంలో అది స్ఫూర్తిగా నిలిచింది. తదుపరి ఏం సినిమా చేయాలని ఇంకా నిర్ణయించుకోలేదు. హాలిడేకు బూటాన్‌కు వెళ్తున్నా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏంటని ఆలోచిస్తా’అని చెప్పుకొచ్చారు..
తన తదుపరి సినిమాను గ్రాఫిక్స్ లేకుండా తీయాలనే ఆలోచన ఉందని, అయితే, అది ఎంత వరకు సాధ్యమౌతుందో తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.తన కుటుంబమే తనకు బలమని, వారి సహకారం వల్లే ‘బాహుబలి’ లాంటి సినిమాను నిర్మించగలిగానని రాజమౌళి చెప్పారు.
పని చేస్తున్నప్పుడు సినిమా విషయంలో ఉద్వేగంగా ఉంటుందన్నారు. కానీ పనులన్నీ పూర్తైన తర్వాత టెన్షన్ మొదలౌతుందన్న జక్కన్న.. సినిమా విషయంలో ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తామని తెలిపారు. తన కెరీర్‌లో బాగా సంతృప్తినిచ్చిన సినిమా బాహుబలి అన్న రాజమౌళి.. ఇప్పటి వరకు వచ్చిన తన సినిమాల్లోని కొన్ని పాత్రలను మాత్రమే భావోద్వేగంతో తీసినట్లు అనిపించేదన్నారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ప్రతి పాత్ర పూర్తి స్థాయిలో సాగుతుందన్నారు.