‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. చిత్ర నిర్మాతల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, ప్రత్యేక షోలు మరియు సాధారణ ప్రదర్శనలకు టికెట్ ధరలు పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చిత్ర బృందం, థియేటర్ యాజమాన్యాలు విడుదల ఏర్పాట్లను వేగవంతం చేశాయి.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జనవరి 8న జరిగే ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.1000గా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం 6PM నుంచి రాత్రి 12AM మధ్య స్పెషల్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ప్రీమియర్ షోలపై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.
అలాగే జనవరి 9 నుంచి వరుసగా 10 రోజుల పాటు సాధారణ షోల కోసం టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలంలో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150 వరకు పెంచుకోవచ్చు. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.200 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి లభించింది.
ఈ నిర్ణయంతో ‘రాజాసాబ్’ సినిమాకు బాక్సాఫీస్ పరంగా మంచి ఆదాయం వచ్చే అవకాశాలు పెరిగాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో, టికెట్ ధరల పెంపును అభిమానులు పెద్దగా అభ్యంతరం చెప్పరని భావిస్తున్నారు.
ప్రభుత్వం విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని థియేటర్ యాజమాన్యాలకు సూచనలు జారీ చేసింది. ప్రేక్షకుల నుంచి అధిక వసూళ్లపై ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా

