తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు చెక్కుల పంపిణీని చేపట్టింది. ఇందులో భాగంగా రైతుబంధు పథకం కింద యాసంగి పంట పెట్టుబడిని బదిలీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలను సేకరించడంతో పాటు వాటిని అప్‌లోడ్ చేసే ప్రక్రియను కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే.. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభంకాగా.. రైతుబంధు కొత్త పోర్టల్‌ను వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,500 మంది ఏఈవోలు ఉన్నారు. ఒక్కో ఏఈవో రోజుకు సగటున 60 మంది రైతుల ప్రొఫార్మాలు నింపే అవకాశం ఉంది. ప్రొఫార్మాను వ్యవసాయశాఖ 9 సులభ పాయింట్లతో తయారు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం విధించిన షరతుల మేరకు పంట పెట్టుబడిని రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు సేకరించిన ఖాతాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అప్‌లోడ్ చేసి ఆర్బీఐకి పంపనున్నారు. ఆర్బీఐ వద్ద ఉన్న ఈ-కుబేర్ సాఫ్ట్‌వేర్ ద్వారా రైతు ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతోంది.