గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈరోజు భారీ వర్షం కురిసింది. కాగా రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టరేట్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారిమళ్లించింది. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 1912, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.