అల్పపీడనం ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల కుంభవృష్టి తరహా వర్షం కురుస్తుండటంతో రోడ్లన్ని జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. తాజా పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఉదయం బేగంపేటలో పర్యటించిన ఆయన మధ్యాహ్నం నిజాంపేటలోని భండారీ లేఅవుట్‌లో పర్యటించారు. వరదనీటిలో చిక్కుకున్న బాధితులతో మాట్లాడి బాధలు తెలుసుకున్నారు. సహాయచర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షం ప్రభావ నాలాల కారణంగా ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. స్ధానిక ప్రజలనుంచి వర్షం వస్తే తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ పర్యటనలో ఉన్నారు. తమ ప్రాంతాల్లో నాలలోని నీరు సరిగా బటయకు వెళ్లగా తమ ఆపార్ట్ మెంట్లన్ని నీటమునిగాయని ప్రజలు కేటీఆర్‌కు వివరించారు. వర్షపు నీటిలో చిక్కుకున్న అపార్ట్ మెంట్లను మంత్రి పరిశీలించారు. ఇకపై నీల్లు నిలువకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
మరోవైపు గురువారం కూడా ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, అల్వాల్, జీడిమెట్ల, ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, హబ్సిగూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముంపు ప్రజలు నిత్యావసర వస్తువులు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్షం మొదలుకావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయచర్యలు చేపడుతున్నప్పటికీ బాధితులకు అవి ఏమాత్రం సరిపోవడం లేదు.